Donkey Milk : హైదరాబాద్‌కు సమీప ప్రాంతాల నుంచి అనేక మంది నగరానికి వచ్చి అనేక వ్యాపారాలు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో గాడిద పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. నగరానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న రైతులు కొందరు గాడిదల్ని పెంచుతూ చక్కని ఆదాయం సంపాదిస్తున్నారు. వారు వారం లేదా 15 రోజులకు ఒకసారి గాడిదలను తెచ్చి నగరంలో వాటి పాలను అమ్ముతూ లాభాలను గడిస్తున్నారు. ఈ క్రమంలోనే లీటర్ గాడిద పాల ధర రూ.7వేల వరకు పలుకుతోంది.
గాడిద పాలను సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ పాలలో ఆవు, గేదె, మేక పాల కన్నా విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయట. ఇవి అనేక రోగాల నుంచి రక్షిస్తాయట. అలాగే టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే ఔషధ గుణాలు కూడా గాడిద పాలలో ఉంటాయట. కనుకనే ఈ పాలను తాగేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక తక్కువ మొత్తంలో కావాలంటే 10 ఎంఎల్ సీసాలను కూడా విక్రయిస్తున్నారు. వీటి ధర సీసాకు రూ.100 వరకు పలుకుతుండడం విశేషం. సాధారణ పాలు అయితే మనకు రూ.100 పెడితేనే లీటర్‌కు పైగానే వస్తాయి. కానీ గాడిద పాలు మాత్రం 10 ఎంఎల్ వరకు మాత్రమే వస్తాయి. దీంతో ఈ వ్యాపారం మంచి లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నుంచి చాలా మంది రైతులు గాడిద పాలను తెచ్చి విక్రయిస్తున్నారు. అయితే కొందరు ఐటీ ఉద్యోగులు కూడా చేస్తున్న ఉద్యోగాలను మానేసి గాడిదల ఫామ్‌లను పెట్టి పాలను అమ్ముతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారట. దీంతో ఇదో కొత్త ఉపాధి మార్గం అయిందని అంటున్నారు. ఇక గాడిద పాలలో మన శరీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా కూడా అధికంగా ఉంటుందట. అందువల్లే ఈ పాలకు అంతటి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇక ఇదంతా చూసి నాలుగు గాడిదల్ని పెట్టుకున్నా దర్జాగా డబ్బులు సంపాదించవచ్చు కదా.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.