Gangavva : పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది గంగవ్వ. మై విలేజ్ షోతో గంగవ్వను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఈ షోలో గంగవ్వ నటన చాలా అద్భుతంగా, సహజంగా ఉంటుంది. ఆమెకు మొదట అసలు నటించడమే తెలియదు. శ్రీకాంత్ ఎలా చెప్తే అలాగే ఆమె చేసి చూపిస్తుంది. గంగవ్వ నిజ జీవితంలో ఎలా అయితే ఉంటుందో అలాగే వీడియోలో కూడా కనిపించడం వల్ల ఆమెకు యూట్యూబ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది గంగవ్వ. కానీ గంగవ్వ పెద్ద వయసు కారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.
బిగ్ బాస్ షోలో నాగార్జున కూడా గంగవ్వకు బాగా సపోర్ట్ చేశారు. ఆమె అమాయకమైన పల్లెటూరి మాటలకు ఎంతో ఆనందంగా నవ్వుకునేవారు నాగార్జున. బిగ్ బాస్ షోలో వచ్చిన రెమ్యూనరేషన్ తో గంగవ్వ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో నాగార్జున కూడా ఆర్థిక సహాయం అందించారు. ఇక ఆ తర్వాత గంగవ్వ యూట్యూబ్ లో సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాకుండా మధ్యమధ్యలో సినిమాల్లో కూడా కనిపించింది గంగవ్వ.

ప్రస్తుతం గంగవ్వ యూట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్ గా తన వీడియోలను పోస్ట్ చేస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటుంది. ప్రేక్షకులకు చేరువగా ఉంటూ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేసుకున్న గంగవ్వ ప్రస్తుతం నెలకు బాగానే సంపాదిస్తుందట. యూట్యూబ్ ఛానల్ లోకి రాకముందు కూలి పనులు చేసుకుని బతికిన గంగవ్వ ఇప్పుడు నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతానికి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న గంగవ్వ భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.