Covid Vaccine : ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రధానంగా పంపిణీ చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ వ్యాక్సిన్ల ధరలు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగానే ఉన్నాయి. కానీ త్వరలోనే వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో ఒక్కో డోసు టీకా కేవలం రూ.275కి మాత్రమే లభ్యం కానుంది. దీనికి అదనంగా మరో రూ.150 సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒక్క డోసు టీకా ధర రూ.425 అవుతుంది.
ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటళ్లలో ఒక్క డోసు కోవాగ్జిన్ టీకా ధర రూ.1200 మేర ఉండగా.. కోవిషీల్డ్‌ను రూ.780కి విక్రయిస్తున్నారు. వీటికి రూ.150 సర్వీస్ చార్జి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే త్వరలో ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో చాలా తక్కువ ధరకే ఈ రెండు వ్యాక్సిన్లు ప్రజలకు లభ్యం కానున్నాయి.
తమ టీకాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలని ఇటీవలే భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం వాటికి చెందిన టీకాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతులు జారీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ రెండు టీకాల ధరలు భారీగా తగ్గనున్నాయని తెలుస్తోంది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద భారత్‌లో ఉపయోగిస్తున్నారు. గతేడాది జనవరి 3వ తేదీన వీటి అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారు. బహిరంగ మార్కెట్‌లో ఇవి అందుబాటులోకి వస్తే భారీగా ధరలు తగ్గనున్నాయి.