Chandigarh University : చండీగఢ్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఓ సంఘటన సంచలనంగా మారింది. యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విద్యార్థినులకు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వరకు లీకయ్యాయని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినులకు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వరకు లీకయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు తెలిపారు. ఓ విద్యార్థిని తన వీడియోను షిమ్లాలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్‌కు షేర్ చేసిందని.. అయితే ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన చండీగఢ్ విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ సంఘటన కారణంగా విద్యార్థినులు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

అయితే పంజాబ్ సీఎం భగవంత్ మన్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మన కూతుళ్లు మనకు గర్వకారణమని, ఈ సంఘటనలో దోషులను విడిచిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ సంఘటనపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాగే ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ సంఘటన చాలా సిగ్గుచేటన్నారు. నిజానిజాలు నిగ్గు తేలే వరకు వేచి చూడాలని కోరారు. అయితే మరోవైపు చండీగఢ్ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.