Bandla Ganesh : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో సినిమాలకు చెందిన ఈవెంట్లలో కనిపించడం లేదు. కానీ కనిపిస్తే మాత్రం ఆయన మాట్లాడే మాటలు వివాదాస్పదం అవుతుంటాయి. ఆయన ప్రీ రిలీజ్ వేడుకల్లో స్టేజిలపై చేసే కామెంట్లు సంచలనం సృష్టిస్తుంటాయి. ఇక తాజాగా ఆయన చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏకంగా మెగాస్టార్, సూపర్ స్టార్ అని పేరు పెట్టి మరీ ఆయా స్టార్స్‌ను అవమానించేలా మాట్లాడారు. దీంతో ఆయనపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం.. చోర్ బజార్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బండ్ల గణేష్ హాజరయ్యారు. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన విజయ్ దేవరకొండతో కలిసి ముంబైలో జేజీఎం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ చేస్తుంది తప్పని అన్నారు. డైలాగ్స్ రాని వాళ్లను మెగా స్టార్, సూపర్ స్టార్‌లను చేశావు అన్నా.. నీ కొడుకు సినిమాకు మాత్రం నువ్వు లేవు.. కనుక నువ్వు చేస్తుంది తప్పు, ఇది సరి కాదు.. అని బండ్ల గణేష్ అన్నారు. కాగా బండ్ల గణేష్ కామెంట్స్ దుమారం రేపాయి.

ఆయన మెగాస్టార్, సూపర్ స్టార్ అనే పదాలు వాడడంతో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పూరీ జగన్నాథ్ రామ్ చరణ్, మహేష్ బాబులతో సినిమాలు చేశారు. కనుకనే బండ్ల గణేష్ ఆ డైలాగ్‌ను వాడినట్లు అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ బండ్ల గణేష్‌పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బండ్ల గణేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై బండ్ల గణేష్ స్పందించాల్సి ఉంది.