Balakrishna : అఖండ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత కూడా ఆయన తీరిక లేకుండా సినిమాలు చేయనున్నారు. అయితే బాలకృష్ణ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఒక్క మూవీకి ఎంత తీసుకుంటున్నారనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
అఖండ సినిమాకు ముందు బాలయ్య ఒక్క మూవీకి రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకున్నారట. ఇక అఖండకు రూ.10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నారు. ఆ మూవీకి బాలయ్య రూ.15 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి మూవీకి బాలకృష్ణ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్‌ను పెంచుతున్నారు.

అయితే హిట్, ఫ్లాప్ అనే దానితో సంబంధం లేకుండా బాలయ్య రెమ్యునరేషన్ తీసుకుంటుండడం విశేషం. కానీ ఆయన బోయపాటి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలే హిట్ అవుతున్నాయి. మిగిలిన దర్శకులతో చేస్తే హిట్ దక్కడం లేదు. మరి ఆయన త్వరలో చేయనున్న రెండు సినిమాలు కూడా ఇతర దర్శకులవే. ఇవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తాయో చూడాలి. కానీ ప్రస్తుతం అగ్ర హీరోల నుంచి కుర్ర హీరోల వరకు రూ.30 కోట్లు కనీసం వసూలు చేస్తున్నారు. వారితో పోలిస్తే బాలకృష్ణ రెమ్యునరేషన్ తక్కువనే చెప్పాలి. కానీ ఆయన సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న టాక్ కూడా ఉంది. కనుకనే నిర్మాతలు ముందు వెనుక చూడకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.