Babu Mohan : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. ఓ దశలో ఆ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఓ వైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్.. మరోవైపు మంచు విష్ణు ప్యానెల్.. ఇలా ఒకరిపై ఒకరు బురదజల్లుకున్నారు. ఒకరినొకరు దారుణంగా విమర్శించుకున్నారు. ఇక ఎన్నికల రోజు అయితే గొడవలే జరిగాయి. అయితే ఎట్టకేలకు ఎన్నికలు ముగిసి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ముగిసిన పర్వం. కానీ దీనిపై ఇప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారలేదు. తాజాగా సీనియర్ నటుడు బాబు మోహన్ మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ అగ్గిని రాజేశారు. ఇంతకీ బాబు మోహన్ ఏమన్నారంటే..
దర్శకరత్న దాసరి నారాయణ రావు కన్ను మూయడంతో సినిమా ఇండస్ట్రీ తన పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఉంటే ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సమస్యలను పట్టించుకునే వారు లేరు. అయితే కొందరు చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని అన్నారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. తాను ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానన్నారు. అది ఆయన ఇష్టం. అయితే ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలనే విషయాన్ని అందరూ కూర్చుని చర్చించుకుని ఎంపిక చేసుకోవాలి. అంతేకానీ కొందరు నిర్ణయించకూడదు.. అని బాబు మోహన్ అన్నారు.

ఇక ప్రకాష్ రాజ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా బాబు మోహన్ స్పందించారు. చెన్నైలో తెలుగు వాళ్లను పోటీ చేసేందుకు అనుమతించమనండి చూద్దాం.. కర్ణాటకలో అయితే తెలుగు సినిమాలనే ఆడనివ్వరు.. అలాంటిది అక్కడ పుట్టిన వ్యక్తి మా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడు.. కనుకనే ఇక్కడి నటీనటులకు ఎవరు ఎలాంటి వారు అనే విషయం అర్థమైంది. కాబట్టి వారికి కావల్సిన వాళ్లనే వారు గెలిపించుకున్నారు.. అని బాబు మోహన్ అన్నారు. అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ఏమని స్పందిస్తారో చూడాలి.