Asia Cup 2022 : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో పసికూన ఆఫ్గనిస్థాన్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఆఫ్గన్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. వికెట్లను వెంట వెంటనే సమర్పించుకున్నారు. దీంతో తక్కువ స్కోరుకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ సునాయాసంగా ఛేదించింది. ఆసియా కప్‌లో బోణీ కొట్టింది. లంక జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా లంక జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో భానుక రాజపక్స (38 పరుగులు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ 3 వికెట్లు పడగొట్టగా ముజీబ్ ఉర్ రహమాన్ 2 వికెట్లు తీశాడు. అలాగే మహమ్మద్ నబీకి 2 వికెట్లు, నవీన్ ఉల్ హక్‌కు 1 వికెట్ దక్కాయి.

అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్‌లలో రహమానుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో వనిందు హసరంగ డిసిల్వాకు 1 వికెట్ దక్కింది. కాగా ఈ టోర్నీలో తరువాతి మ్యాచ్ భారత్, పాక్‌ల మధ్య ఇదే వేదికపై జరగనుంది. ఆదివారం ఆగస్టు 28వ తేదీన రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.