విశాఖపట్నంలో లక్ష్మి అపర్ణ అనే మహిళపై గతవారం పోలీసులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రోజురోజుకు లక్ష్మీ అపర్ణకు మద్దతు పెరుగుతోంది. విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించి ఆమెపై లేనిపోని కేసులను నమోదు చేశారని ఆరోపణలతో మహిళా సంఘాలు ఆమెకు పూర్తి మద్దతు తెలిపాయి.
ఈ క్రమంలోనే విజయవాడలో ఐద్వా ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ లక్ష్మీ అపర్ణ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ ఆమెపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని, ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పోలీసులు ఆ యువతి పట్ల ప్రవర్తించిన తీరును కప్పిపుచ్చుకోవడం కోసమే ఆమెపై మద్యం నేరం వేశారని, వీరి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నానా హంగామా చేస్తున్నారని ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు తెలిపారు. అపర్ణ ఎలాంటి తప్పు చేయకుండా ఆమెను పోలీసులు స్టేషన్ కి తరలించడం చట్టవిరుద్ధం అని భావించారు. ఆమె పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించటం పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విశాఖ ప్రజలంతా ఆమెకు ఎంతో అండగా ఉండాలని మహిళా సంఘం నేతలు పిలుపునిచ్చారు.