విజయవాడలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనే భక్తులకు ఆలయ కమిటీ పలు ముఖ్య ఆదేశాలను జారీ చేసింది.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచే అమ్మవారి ఆలయంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్, ఈవో, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆలయంలో పనిచేసే దాదాపు 45 మంది సిబ్బంది కరోనా బారిన పడగా, ఆలయ అర్చకులు మరణించడంతో ఆలయ కమిటీ పటిష్టమైన చర్యలు చేపట్టనుంది.
మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకే అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి ఏడు తర్వాత ఘాట్‌రోడ్డు, మహామండపం, మెట్ల మార్గాలను మూసివేయనున్నారు. అమ్మవారికి జరిగే ఏకాంత పూజలను యధావిధిగా నిర్వహించనున్నారు.
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. మాస్క్ లేనిపక్షంలో 200 జరిమానా విధించనున్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులు ఆరు అడుగుల బౌతిక దూరం పాటించాలి. అదేవిధంగా ప్రతి గంటకు ఒకసారి క్యూలైన్లను సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఆలయ ఆవరణలోని వసతి గృహాలు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తులకు టెంపరేచర్ పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా భక్తులు గుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటించే విధంగా అన్ని జాగ్రత్తలను చేపట్టినట్లు ఆలయ కమిటీ తెలియజేసింది.