అదృష్టం అనేది చెప్పి రాదు. అది అనుకోకుండానే కలసి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవును. కొందరికి అదృష్టం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతారు. కానీ కొందరు దాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. దీంతో ఆకస్మిక ధనం చేతికందుతుంది. ఓ మత్స్యకారుడికి కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లిన జాలర్లకు ఓ అరుదైన చేప చిక్కింది. అది కచ్చిలి చేప. ఇది చేప జాతుల్లో అత్యంత అరుదైంది. ఎక్కువ బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ చేపను చూసేందుకు చాలా మంది తరలి వచ్చారు. దాన్ని మాకు అమ్మాలంటే మాకు అమ్మాలని పోటీ పడ్డారు.
అయితే ఆ చేపకు వేలం నిర్వహించారు. దీంతో భారీ ధర పలికింది. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి ఆ చేపకు రూ.2.40 లక్షలు చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. ఆ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారట. అందుకనే దానికి అంతటి ధర ఉంటుందని పలువురు తెలిపారు.