ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ జాబ్ మార్చి 2022 వరకు జాబ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 2022 వరకు మొత్తం 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
దళారులు, సిఫారసులు, పైరవీలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతామని సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారని అన్నారు. వారు మనో ధైర్యం కోల్పోకుండా ఉండేందుకే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ఏ నెలలో వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. 2 ఏళ్లలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేశామని, 1,84,264 ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 ఉద్యోగాలను పొరుగు సేవల రూపంలో భర్తీ చేశామన్నారు. మరో 19,701 ఒప్పంద ఉద్యోగాలను ఇచ్చామన్నారు. రూ.3500 కోట్ల భారం పడుతుందని తెలిసినా ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు తెలిపారు. 51,387 మంది ఆర్‌టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించినట్లు వివరించారు.