Anchor Shyamala : పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలుమార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా పాదయాత్ర అనే చెప్పాలి. తాజాగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది.
తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కరణ.. సమగ్ర అవగాహనలో భాగంగా ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు షర్మిల. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది.
మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా పాదయాత్రలో ఆసక్తికర సంఘటన నెలకొంది. షర్మిలతోపాటు టాలీవుడ్ ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. శ్యామల మాట్లాడుతూ.. మొదటి నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానిని.. వైఎస్ మహానేత కుమార్తె షర్మిల.. ఆమె సోదరుడు సీఎం జగన్.. ఒక రాష్ట్రానికి సీఎం.. ఆమె ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు
అవన్నీ ఆమె వదులుకొని, మన కోసం, సామాన్యుల కోసం రోడ్లపైకి వచ్చింది. తండ్రి ఆశయాలను భుజాన వేసుకొని ముందుకు వచ్చిన షర్మిల అక్క నాకు, మన అందరికీ ఆదర్శమని తెలిపింది శ్యామల.