Anasuya : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనంతర బయటకు వచ్చిన.. వారి ప్యానెల్‌లో ఒక సభ్యురాలు అయిన నటి, యాంకర్ అనసూయ.. మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకెళతానని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది.
తమ ప్యానెల్ సభ్యులు చెప్పాల్సిందంతా ప్రెస్ మీట్‌లో చెప్పేశారని, తాను చెప్పేది ఏమీ లేదని తెలిపింది. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రాగానే గెలిచానని కొందరు కంగ్రాట్స్ చెప్పారని.. అంత వేగంగా బయటకు సమాచారం ఎలా వచ్చిందని ? ఆమె ప్రశ్నించింది. అలాగే రాత్రికి రాత్రే ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయి ? అని ప్రశ్నలు వేసింది.
ఇక కొన్ని మీడియా చానల్స్, వెబ్‌సైట్స్, పత్రికలు తన గురించి అబద్దాలు రాస్తున్నాయని.. అలాంటి వాళ్లకు, సంస్థలకు వార్నింగ్ ఇస్తున్నానని.. నిజాలు రాయాలని.. తన ప్రమేయం లేకుండా తమ గురించి రాసినా.. తప్పుడు వార్తలను ప్రసారం చేసినా.. అలాంటి వారిపై కోర్టుకెళతానని అనసూయ హెచ్చరించింది.