Cumin Water : జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీని వల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమి కొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలంటే.. ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంత సేపు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. కడుపులో పురుగులు ఉంటే చనిపోతాయి. జీలకర్ర నీటిని తాగితే గర్భిణీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజం చేస్తాయి. దీంతో పాలు బాగా పడతాయి.
డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్‌ఫుల్ మెడిసిన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది. షుగర్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. జీలకర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంటుంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు రావు. సహజ సిద్ధమైన యాంటీ వైరల్, యాంటీ బయోటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి. కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తగ్గుతాయి.
జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలలో రాళ్లు కరుగుతాయి. మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి. కడుపులో వికారంగా ఉండడం, తల తిప్పడం, త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది. కడుపులో ఏర్పడే అల్సర్లను, పుండ్లను తగ్గించడంలో జీలకర్ర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రోజూ కొద్దిగా జీలకర్ర నీటిని తాగితే చాలు. దీంతో ఆయా సమస్యలు దూరమవుతాయి. జీలకర్ర నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారు. నిద్రలేమితో బాధ పడే వారు జీలకర్ర నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇలా జీలకర్ర నీటితో అనేక లాభాలను పొందవచ్చు.