Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ మూవీకి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట ఎంత హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆ పాటను పాడిన సింగర్ సిద్ శ్రీరామ్‌పై అల్లు అర్జున్ తాజాగా ప్రశంసలు కురిపించాడు.
సిద్ శ్రీరామ్‌కు మ్యూజిక్ అవసరం లేదని.. అతనే ఒక మ్యూజిక్.. అని అల్లు అర్జున్.. శ్రీరామ్‌పై ప్రశంసలు కురిపించాడు. దీంతో స్పందించిన శ్రీరామ్ మాట్లాడుతూ.. నాపై మీరు కురిపించిన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యుడిని, మీలాంటి ప్రముఖుల మాటలకు ఎంతో విలువ ఉంటుంది, అవే నాకు ప్రపంచం, నన్ను అభినందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం నెటిజన్లకు నచ్చలేదు.
వాస్తవానికి సిద్ శ్రీరామ్ తమిళ సింగర్. అతని తెలుగు, తమిళం కలసిపోయి ఉంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో తెలుగులోనూ తప్పులు దొర్లుతుంటాయి. అది సహజమే. కానీ అల్లు అర్జున్ ఒక తమిళ సింగర్‌ను మెచ్చుకోవడం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో వారు కామెంట్లకు పనిచెప్పారు. అల్లు అర్జున్ ఒక తమిళ సింగర్‌ను మెచ్చుకోవడం ఏమిటి..? అతను బాగా పాటలు పాడగలడు.. కానీ తెలుగు సరిగ్గా మాట్లాడలేడు.. అలాంటి వ్యక్తిని ఎలా మెచ్చుకుంటారు.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే టాలెంట్ ఉండాలేగానీ అందుకు భాషతో పనిలేదు. తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినంత మాత్రాన సిద్ శ్రీరామ్‌ను నిందించాల్సిన పనిలేదు, అతని టాలెంట్‌ను మెచ్చుకోవాలి.. అని కొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.