Allu Aravind : టాలీవుడ్ లో అత్యధిక స్టార్స్ మెగా ఫ్యామిలీకి చెందినవారే. చిరంజీవి అనే వటవృక్షం క్రింద అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ గా ఎదిగారు. అలాగే సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ మోస్తరు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాస్తా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీగా విడిపోయాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక ఈ దూరం మరింత పెరిగిందని, కొన్నాళ్లుగా అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్నారని, ఆయన అల్లు రామలింగయ్య మనవడిగా పిలవబడడానికే ఇష్టపడుతున్నాడని, మెగా ట్యాగ్ ఆయనకు నచ్చడం లేదని సమాచారం.
ఇటీవల ఓ సందర్భంలో బన్నీ అవర్ ఫౌండేషన్ అంటూ అల్లు రామలింగయ్య ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో తన అభివృద్ధికి కారణం తాతయ్య కానీ, మేనమామ కాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. మొదటి నుంచి ఉన్న బంధమే ఇప్పుడు కూడా ఇరు కుటుంబాల మధ్య ఉందని తేల్చి చెప్పేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అరవింద్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ బల్ల గుద్దిచెప్తున్నాను. అలాంటిదేమి లేదు. అయితే ఇరు కుటుంబాలు కలుసుకోవడం లేదు అన్నది వాస్తవమే.. ఎందుకంటే పిల్లలు పెద్దవారు అవుతున్నారు.. ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉంటున్నారు.

అందరికీ ఒకేసారి టైం కుదరడం లేదు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా అందరు ఒక్క చోట చేరిపోతారు. మా మధ్య సంబంధాలు తెగిపోయాయి అనేది కేవలం పుకారు మాత్రమే. మేమంతా కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటామని వీడియోలు తీసి చూపించాలా? అలా పెట్టలేం కదా.. కాంపిటీషన్‌లో ఎవరికి వాళ్లు పైకి వస్తున్నారు. కానీ అంతా ఒక్కటే అని క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ (గీతా ఆర్ట్స్)ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు అల్లు రామలింగయ్య పేరుతో ఫిల్మ్ స్టూడియోని కూడా నిర్మించారు.