Aha OTT : కరోనా నేపథ్యంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువైంది. చాలా వరకు సినిమాలు గత 2 సంవత్సరాల నుంచి ఓటీటీల్లోనే విడుదల కాగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. కొత్త సినిమా విడుదలయ్యాక థియేటర్ల కన్నా నెల రోజులు ఆగితే ఏకంగా ఓటీటీలోనే చూడవచ్చని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. కనుక టీవీల్లో సినిమాలు చూసే రోజులు కూడా పోయాయని చెప్పవచ్చు. ఓటీటీల్లోనే యాడ్స్ లేకుండా ఎంచక్కా ప్రేక్షకులు సినిమాలను వీక్షిస్తున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ప్లాట్ ఫామ్‌లో త్వరలో30 సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

హాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం మన దేశంలో ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. హిందీ, తమిళం, మళయాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆహా తన ప్లాట్‌ఫామ్‌పై 30 ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీలను రానున్న రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. సదరు మూవీలను ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆహా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ సినిమాలు ప్రతి శుక్రవారం ఒకటి రిలీజ్ కానుండగా.. వాటిల్లో స్పైడర్ మ్యాన్ సిరీస్ మూవీలు, మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ మూవీలు, సాల్ట్.. ఇతర ప్రముఖ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఆహా ఓటీటీ యాప్‌లో త్వరలో తెలుగు వెర్షన్‌లో లభ్యం కానున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం లభ్యం కానుంది. అయితే ఈ మూవీలను ఎప్పుడు రిలీజ్ చేసేది వెల్లడించలేదు. కానీ ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.