Aha : ప్రస్తుత తరుణంలో ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా పుణ్యమా అని ఓటీటీల బిజినెస్ ఒక్కసారిగా పెరిగింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడంతో ఓటీటీలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోయినా ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడడం వల్ల థియేటర్ల వైపు వెళ్లడం లేదు. రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి మూవీలకు తొలి రోజే థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపించాయి. అంటే పెరిగిన టిక్కెట్ల ధరలతోపాటు ఓటీటీల ప్రభావం వారిపై పడిందన్నమాట. అందులో భాగంగానే ఓటీటీ యాప్స్ కూడా కొత్త కొత్త సినిమాలను తమ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేస్తున్నాయి.
థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన తరువాత కేవలం 3 వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ యాప్స్ లేటెస్ట్ మూవీలను విడుదల చేస్తున్నాయి. అయితే కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ లతో పోటీ పడుతున్న ఆహా తాజాగా తన ప్రేక్షకులు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ప్లాట్‌ఫామ్‌పై మొత్తం 30 హాలీవుడ్ డబ్బింగ్ మూవీలను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆహా ట్వీట్ చేసింది.

ఇందులో భాగంగా ఆహా ప్రతి శుక్రవారం పలు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలను తన ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయనుంది. ఇక ఈ శుక్రవారం.. అంటే.. మే20వ తేదీన మెన్ ఇన్ బ్లాక్ 3, ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్, రెసిడెంట్ ఈవిల్, రెసిడెంట్ ఈవిల్ ఎక్స్‌టింక్షన్, జాంగో అన్‌చెయిన్డ్ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలియజేసింది. వీటిని తెలుగు ప్రేక్షలకు సౌకర్యార్థం తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక మొత్తం 30 మూవీలను ఒకేసారి కాకుండా విడతల వారిగా రిలీజ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. వచ్చే శుక్రవారం మరికొన్ని మూవీలు ఆహాలో రానున్నాయి.
— ahavideoin (@ahavideoIN) May 17, 2022