Adipurush Team : ఆదిపురుష్ టీజర్ విడుదలయిన దగ్గరి నుండి చిత్ర యూనిట్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. పసలేని వీఎఫ్ఎక్స్, యానిమేషన్, పురాణ పాత్రలకు సంబంధం లేని క్యారెక్టర్ల సృష్టి, ఆ పాత్రల కాస్ట్యూమ్స్, ఎవరికీ తెలియని నటులు, వాళ్ల గెటప్ లు ఇలా టీజర్ లోని ప్రతి విషయం ట్రోలింగ్ చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఉన్నాయి. న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో ఆదిపురుష్ టీజర్ ను దారుణంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. దేశంలో అందరూ ఎంతగానో ఆరాధించే రాముడి కథను ఈ విధంగా చెడగొడుతున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు.
ఇంత భారీ ఎత్తున ట్రోలింగ్, ఇంకా విమర్శలతో చిత్ర యూనిట్ బయపడి పోయి నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. నెగిటివిటీని తగ్గించడానికి కొన్ని విచిత్రమైన జిమ్మిక్కులను చేయడం మొదలు పెట్టింది. చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ట్రోలింగ్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆదిపురుష్ సినిమా పెద్ద స్క్రీన్ల కోసం తీసిందని మొబైల్ ఫోన్లలో టీజర్ ద్వారా దాని గొప్పదనం తెలియదని వివరించాడు. అసలు యూట్యూబ్ లో టీజర్ విడుదల చేయదలచు కోలేదని కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం తప్పలేదని అన్నాడు.

అయితే అవతార్ ఇంకా అవెంజర్స్ లాంటి సినిమాలు తమ టీజర్లను యూట్యూబ్ లోనే విడుదల చేశాయని ప్రేక్షకులు వాటిని మొబైల్ ఫోన్లలోనే చూసి బ్రహ్మరథం పట్టారని ఓమ్ రౌత్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర యూనిట్ విమర్శలను, ట్రోలింగ్ ను తగ్గించడానికి కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు భారీ మొత్తంలో డబ్బును ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో వారు మొబైల్ లో చూసిన దాని కంటే ఐ మాక్స్, 3డి తెరలపై చూసినప్పుడు ఆదిపురుష్ సినిమా గొప్పగా అద్భుతంగా ఉటుందని పోస్టులు పెడుతున్నారని సమాచారం అందుతుంది. ఇదే విధంగా సినిమా గ్రాఫిక్స్ గురించి పాజిటివ్ పబ్లిసిటీ చేయాలని చిత్ర యూనిట్ వారిని కోరుతున్నారని తెలుస్తోంది.
దీనిపై కొందరు సినీ పెద్దలు మాత్రం ఆదిపురుష్ సినిమా యూనిట్ ను తప్పు పడుతున్నారు. ఇలాంటివి చేసి ప్రేక్షకులను మోసం చేయలేరని వారు చాలా తెలివైన వారని అంటున్నారు. ఏది మంచి సినిమా ఏది చెడ్డ సినిమా అనేది వాళ్లే నిర్ణయిస్తారని చెబుతున్నారు.