Acharya : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆచార్య సందడి నెలకొంది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. ఏ థియేటర్ వద్ద చూసినా మెగా అభిమానుల సందడే కనిపిస్తోంది. మూడేళ్ల తర్వాత చిరు సినిమా రావడం.. అది కూడా అనేక వాయిదాల అనంతరం విడుదల కావడంతో.. ఆచార్య సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఈ సినిమాపై సోషల్ మీడయాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘటికుడు సినిమా గుర్తుందా ? అందులో ఆ చిత్ర బృందం ఒక ప్రయోగం చేసింది. సూర్య చిన్నప్పటి పాత్రకు చిన్న పిల్లాడెవరినీ తీసుకోకుండా.. సూర్యకు మీసం తీసేసి.. అతడి ముఖాన్నే చిన్న పిల్లాడి లాగా వీఎఫ్ఎక్స్ ద్వారా మార్చి టీనేజీ కుర్రాడిగా చూపించారు. అవి ప్రేక్షకులని చాలా ఇబ్బందికి గురి చేశాయి. ఇక ఆచార్య చిత్రంలోనూ అలాంటి ప్రయోగమే చేశారు. అది బెడిసికొట్టేసింది.
ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవిని యువకుడిగా చూపించాల్సిన అవసరం పడింది. దాంతో కొరటాల శివ చిరు కెరీర్ తొలి నాళ్లలోని ఒక ఫొటోను బయటికి తీసి వీఎఫ్ఎక్స్ ద్వారా ఆ లుక్‌తోనే చిరు హావభావాలు పలికిస్తున్నట్లు చూపించారు. ఐతే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా బెడిసి కొట్టేశాయి. చాలా కృత్రిమంగా అనిపించాయి. చిరును అలా చూడలేకపోయారు అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సన్నివేశం ముగుస్తుందా అనిపించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉండగా, ఇలాంటి సన్నివేశాలపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.