రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. జనవరి 20వ తేదీ వరకు ఇందుకు గాను గడువు విధించారు. అభ్యర్థులను రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు. ఇందులో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 11 జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ, బీటెక్ చదివి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.450 కాగా రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్షలను ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహిస్తారు.