Truck Driver Rajesh : సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి ఈ రోజుల్లో ఉపాధి లభిస్తోంది. అందులో వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకోవడమే కాక నెల నెలా రెండు చేతులా సంపాదిస్తున్నారు. అందుకు యూట్యూబ్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలా సోషల్ మీడియానే స్వయం ఉపాధిగా మలుచుకున్నవారు చాలా మందే ఉంటున్నారు. నెల నెలా వారు కొన్ని వేల డాలర్లను సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఒక వ్యక్తి గురించే. ఇంతకీ అతను ఎవరంటే..
జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ అనే ప్రాంతానికి చెందిన రాజేష్ రావణి వృత్తి రీత్యా ఒక లారీ డ్రైవర్. గత 20 ఏళ్ల నుంచి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను లారీ డ్రైవర్‌గా నెలకు దాదాపుగా రూ.25వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడు. కానీ ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా నెలకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తుండడం విశేషం. ఒక సారి అధిక మొత్తంలో నెలకు రూ.10 లక్షలు కూడా వచ్చాయని అతను చెప్పాడు. ఈ విధంగా రాజేష్ ఓవైపు లారీని నడిపిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాడు.

1.87 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు..
మొదట్లో రాజేష్ లారీ డ్రైవ్ చేస్తూ వెళ్లినప్పుడు అతని కుమారుడు అతని వంట వీడియోలను తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అవి పాపులర్ అయ్యాయి. ఇక ఆ తరువాత రాజేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే అలా ఎన్నో వీడియోలను అతను తన చానల్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో రాజేష్‌కు ఏకంగా 1.87 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండడం విశేషం. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పెద్ద ఎత్తున ఇతనికి ఫాలోవర్లు ఉన్నారు.
ఆలోచన ఉండాలే కానీ ఏ పని చేసి అయినా సరే డబ్బు సంపాదించవచ్చు.. అని చెప్పేందుకు రాజేష్ జీవితమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఇక అతను వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని అతను చెప్పాడు. రాజేష్ జీవితం నిజంగా ఇలా ఉపాధి పొందాలనుకుంటున్న వారికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.