Hair Growth : మహిళలు, ముఖ్యంగా యువతులు తమ శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే ఒత్తుగా, ప్రకాశవంతంగా ఉండే తల వెంటుక్రలతో మేనికి అందం కూడా వస్తుంది. కానీ అవి కేవలం ఒకే రాత్రిలో పెరగలేవుగా! వాటి పట్ల ఎప్పటికప్పుడు సంరక్షణ వహిస్తూ, జాగ్రత్తగా చూసుకుంటేనే అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మనిషి తల వెంట్రుకలు నెలకు అరంగుళం చొప్పున పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 16 అంగుళాల పొడవు పెరగాలంటే అందుకు దాదాపు 32 నెలల సమయం పడుతుంది. అయితే అధిక శాతం మంది తమ జుట్టుపై శ్రద్ధ వహించక నిర్లక్ష్యం చేస్తారు. దీంతో జుట్టు చిట్లడమో, పొడిబారడమో జరిగి పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే శిరోజాలు బాగా పెరగాలంటే కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తల వెంట్రుకలు పొడవుగా పెరగాలని కోరుకునే వారు కెమికల్స్ లేని షాంపూలు, కడిషనర్‌లను వాడాలి. సల్ఫేట్స్, సిలికాన్, ఎస్‌ఎల్‌ఎస్ వంటి పదార్థాలు ఉన్న షాంపూలు, కండిషనర్లు అస్సలు వాడకూడదు. తల వెంట్రుకలను సంరక్షించుకోవాలంటే వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయాలి. అతి ఎక్కువగా కూడా తలస్నానం చేయకూడదు. ఇది వెంట్రుకలను చిట్లిపోయేలా చేస్తుంది. తలస్నానానికి ఎల్లప్పుడూ చల్లని నీటినే వాడాలి. ఎందుకంటే వేడి నీటి వల్ల వెంట్రుకలు విరిగిపోయే విధంగా మారతాయి. వెంటుక్రలు తడిగా ఉన్నప్పుడు తల దువ్వకూడదు. ఇది జుట్టును బలహీనంగా చేసి వెంట్రుకల చివర్లను పగిలిపోయేలా చేస్తుంది. అదేవిధంగా కఠినంగా ఉండే దువ్వెనలు కాకుండా వెంట్రుకలపై సాఫ్ట్‌గా ఉండే దువ్వెనలనే తల దువ్వుకునేందుకు ఉపయోగించాలి.

జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. దీంతో వెంట్రుకల చివరన ఉండే పగుళ్లు తొలగిపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును సంరక్షించుకోవాలంటే మరో ముఖ్యమైన సూచన సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం. ప్రధానంగా చేపలు, పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. లేదంటే డీహైడ్రేషన్ కారణంగా వెంట్రుకలు తమ సహజ మృదుత్వం కోల్పోయి పొడిగా మారతాయి. దీంతో అవి రాలిపోయేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనుక డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీంతో జుట్టు కూడా సురక్షితంగా ఉంటుంది.