Onions : ఉల్లిపాయలతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఎన్నో పోషకాలకు నెలవైన ఉల్లిపాయలను మనం నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాటితో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. అయితే వాటి గురించిన ఒక పుకారు ఇప్పుడు నెట్‌లో, ప్రధానంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆసక్తి రేపుతున్న ఆ ఉల్లిపాయ పుకారు ఏంటో మీరే చూడండి..!
ఉల్లిపాయలు సహజంగానే ఘాటైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వాటిని కోసినప్పుడు మన కళ్ల వెంట నీళ్లు వస్తాయి. అయితే ఉల్లిపాయలను సగానికి కోసి అలాగే ఉంచినప్పుడు అవి బాక్టీరియా, సూక్ష్మ క్రిములను ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఈ క్రమంలో ఎక్కువ సేపు అలాగే ఉంచిన ఉల్లిపాయల్లో బాక్టీరియా, క్రిములు ఎక్కువగా పేరుకుపోతాయట. దీంతో అలా ఎక్కువ సేపు ఉంచిన ఉల్లిపాయలను వాడితే వాటిలో ఉండే బాక్టీరియా అంతా మన శరీరంలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లను, కడుపు నొప్పిని కలిగిస్తుందట. ఒక రోజు కన్నా ఎక్కువ సేపు అలాగే ఉంచిన ఉల్లిపాయలతో ఇలా జరుగుతుందట. అందుకే ఉల్లిపాయలను కట్ చేసిన తరువాత వెంటనే ఉపయోగించాలట. అంతే కానీ వాటిని ఎక్కువ సేపు ఉంచి మాత్రం వాడకూడదట. ఇదీ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్న ఉల్లిపాయ పుకారు.

అయితే పైన చెప్పిన ఆ ఉల్లిపాయ పుకారులో ఎంత మాత్రం వాస్తవం లేదట. దీన్ని నమ్మాల్సిన పని లేదని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఉల్లిపాయకు ఉండే ఘాటైన వాసన కారణంగా అందులో ఎలాంటి బాక్టీరియా చేరదట. అలాంటి స్థితిలో ఉల్లిపాయలో ఏ బాక్టీరియా కూడా వృద్ధి చెందదట. కాకపోతే దాన్ని కోసే సమయంలో, నిల్వ చేసే సమయంలో శుభ్రంగా ఉండాలట. లేదంటే బాక్టీరియా చేరుతుందని వారు చెబుతున్నారు. శుభ్రంగా కోసి ప్రత్యేకమైన పాత్రల్లో శుభ్రమైన పద్ధతిలో నిల్వ చేస్తే 2-3 రోజుల వరకు ఉల్లిపాయలు స్వచ్ఛంగానే ఉంటాయని, వాటిని ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చని వారు సెలవిస్తున్నారు. అయితే ఉల్లిపాయలే కాదు, ఎలాంటి ఆహారన్నయినా శుభ్రమైన వాతావరణంలోనే ఉంచాలని, చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే దాన్ని ముట్టుకోవాలని చెబుతున్నారు. అంతే కదా మరి..!