Headache Home Remedies : తలనొప్పి అనేది సహజంగానే చాలా మందికి అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండడం, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, పలు ఇతర కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్లను వాడుతుంటారు. కానీ వీటిని వాడడం వల్ల దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక తలనొప్పి తగ్గేందుకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక తలనొప్పి తగ్గేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తలనొప్పి నుంచి బయట పడేందుకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్ష పండ్లను నేరుగా తిన్నా లేదా వాటితో తయారు చేసే జ్యూస్‌ను తాగినా కూడా తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, మూడ్‌ను నియంత్రించే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. కనుక ద్రాక్ష పండ్లను తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు కాసిన్ని ద్రాక్ష పండ్లను తినండి. లేదా వాటితో జ్యూస్ తయారు చేసి తాగండి. దీంతో వెంటనే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
తలనొప్పిని తగ్గించడంలో అల్లం రసం కూడా బాగానే పనిచేస్తుంది. చిన్న అల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం రసంలో అంతే మోతాదులో నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది.
తలనొప్పిని తగ్గించేందుకు దాల్చిన చెక్క కూడా పనిచేస్తుంది. ఇది ఆహారాలకు రుచి ఇస్తుంది. అంతేకాదు మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్కతో టీ తయారు చేసి తాగితే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాయాలి. కొంతసేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేసినా కూడా తలనొప్పి తగ్గుతుంది. అదేవిధంగా తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై వేడి నీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటించి తలనొప్పిని తగ్గించుకోవచ్చు.