నిత్యం మసాలా వంటలు తిని కొన్నిసార్లు మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి నోటికి రుచిగా అనిపించే టమోటో – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బాగా పండిన టమోటాలు 5
*పచ్చిమిర్చి 10
*ఉల్లిపాయ ఒకటి
*వెల్లుల్లి రెబ్బలు పది
*ఉప్పు తగినంత
*నూనె తగినంత
*కొత్తిమీర తురుము కొద్దిగా
తయారీ విధానం
ముందుగా బాగా పండిన టమోటా పండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను సన్నటి పొడవాటి ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి అదే గోళంలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా టమోటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కాసేపు చల్లారనివ్వాలి.
ఈ పదార్థాలన్నీ చల్ల పడగానే ముందుగా రోలులో కొద్దిగా ఉప్పు వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయను మెత్తగా అయిన తర్వాత టమోటాలు వేసి బాగా రుబ్బాలి. ఈ మిశ్రమంలోకే కొత్తిమీర తురుము వేసి మరొకసారి రుబ్బితే ఎంతో రుచికరమైన టమోటో వెల్లుల్లి చట్నీ తయారైనట్లే. దీనిని మనం వేడి వేడి అన్నంలోకి లేదా రాగి ముద్ద కాంబినేషన్ లో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.