సాధారణంగా మనం పూర్ణం బొబ్బట్లు గురించి వినే ఉంటాం. కానీ బనానా బొబ్బట్లు తినడం చాలా అరుదు. తినడానికి బనానా బొబ్బట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి అంతటి రుచికరమైన బనానా బొబ్బట్లు చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*అరటి పండు గుజ్జు రెండు కప్పులు
*బాదం జీడిపప్పు పొడి మూడు టేబుల్ స్పూన్లు
*గోధుమపిండి ఒక కప్పు
*బెల్లం తురుము ఒక కప్పు
*ఏలకులపొడి టీ స్పూన్
*నెయ్యి 5 టేబుల్ స్పూన్లు
*నీళ్లు సరిపడేంత
తయారీ విధానం
ముందుగా గోధుమ పిండిలోకి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ చపాతీ పిండిలాగా తయారుచేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.తరువాత స్టవ్పై ఒక గిన్నె ఉంచి ఒక కప్పు నీటిని పోసి ఒక కప్పు బెల్లం తురుము వేసి బాగా మరిగించాలి. ఈ బెల్లం పాకంలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఈ మిశ్రమం బాగా దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి బనానా గుజ్జు, ఏలకులపొడి, బాదం జీడిపప్పు పొడిని వేసి కలుపుకోవాలి.
తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న గోధుమపిండిని మరొకసారి కొద్దిగా నూనె వేసుకొని మెత్తగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చపాతి పిండి సైజు తీసుకొని దాన్ని కొద్దిగా వెడల్పుగా చేసి బనానా గుజ్జును అందులో పెట్టి తర్వాత ఆ గుజ్జు కనపడకుండా పిండితో కప్పివేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ కర్రతో చపాతీ సైజులో తిక్కి పెనంపై నెయ్యిని వేస్తూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బనానా బొబ్బట్లు తయారైనట్లే.