రాయలసీమ స్పెషల్ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చే నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు అంటేనే ప్రతి ఒక్కరు నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎంతో రుచిగా ఉండే రాయలసీమ నాటుకోడి పులుసు తినడానికి వివిధ ప్రాంతాల వారు ఎంతో ఇష్టపడుతుంటారు. నాటుకోడి లోకి రాగి ముద్దను తింటే ఆ రుచే వేరు . ఇలా చెబుతూ ఉంటే మీకు నాటుకోడి తినాలనిపిస్తుంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
*నాటుకోడి చికెన్ 500 గ్రాములు
*వెల్లుల్లి ఒకటి
*ఉల్లిపాయ ఒకటి
*కొత్తిమీర
*అల్లం
*కొబ్బెర చిన్నకప్పు
*లవంగాలు 6
*ధనియాలు
*ఎండు మిరపకాయలు
*నిమ్మకాయ ఒకటి
*పసుపు చిటికెడు
*ఉప్పు తగినంత
*మూడు టేబుల్ టీస్పూన్ల నూనె
తయారీ విధానం:
స్టవ్ పై ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు, లవంగాలు, ధనియాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తరువాత రోట్లో ఎండు మిరపకాయలు, ధనియాలు, లవంగాలు, కొబ్బెర, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్ తయారు చేయడానికి ముందుగా మసాలాను ఈ విధంగా తయారుచేసి పెట్టుకోవాలి.
తర్వాత చికెన్ ను ఒక గిన్నెలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. అందులో నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక మనకు అవసరం అయితే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే నూనె వేడెక్కిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ బాగా కలియబెడుతూ రెండు నిమిషాలపాటు నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల మసాలా పచ్చి వాసన రాకుండా చికెన్ ముక్కలకు ఉప్పు, కారం బాగా పడుతుంది.
ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ లో నీళ్ళు పోసి మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ వెళ్లే వరకు వేచి ఉండాలి. ప్రెజర్ వెళ్ళిన తరువాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఉడికించడంతో ఎంతో రుచి కరమైన రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు తయారు అవుతుంది. నాటుకోడి పులుసు తాగడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ఈ పులుసు తాగటం వల్ల జలుబు, దగ్గు కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. అందుకే నాటు కోడి పులుసు అంటే ఎంతోమంది ఇష్టంగా తింటారు.