కరోనా బారిన పడ్డాక బతికించండి మహాప్రభో.. అని వెళితే దోచుకునే హాస్పిటల్స్‌నే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కొంత మంది వైద్యులు ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండానే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి డాక్టర్లలో ఈయన ఒకరు.
బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బి అక్కడి బీజీఎస్ హాస్పిటల్‌లో కొన్నేళ్లుగా పనిచేశారు. తరువాత బీబీఎంపీ హాస్పిటల్‌లో రాత్రి షిఫ్టులో కోవిడ్ కేర్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అయితే రాత్రి పూట డ్యూటీ కాబట్టి ఉదయం ఓ వాహనంలో తిరుగుతూ కోవిడ్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఈయన 2011లోనే మాతృ శ్రీ పేరిట ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఊళ్లో తిరుగుతూ అవసరం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఉచితంగా మందులను కూడా ఇస్తుంటారు.
ఇక కరోనా వల్ల ప్రస్తుతం ఆయన కోవిడ్ బాధితులకు వారి ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. తన వాహనాన్ని ఆయన ఓ మొబైల్ క్లినిక్‌గా మార్చారు. అందులో ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ మెషిన్ వంటివి ఉంటాయి. ఇక అవసరం అయిన వారికి మందులను కూడా ఉచితంగానే ఇస్తున్నారు. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికే ప్రస్తుతం సేవలు అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఆయన రోజంతా సుమారుగా 100 కిలోమీటర్లు కవర్ చేస్తూ అలా రోగులకు చికిత్స అందిస్తారు. రాత్రి మళ్లీ యథావిధిగా విధులకు హాజరవుతారు. ఆయన అందిస్తున్న సేవలకు ఆయన్ను అందరూ ప్రశంసిస్తున్నారు. అవును.. ఇలాంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టే ఇంకా మానవత్వం బతికి ఉందని చెప్పవచ్చు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ డాక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.