ప్రస్తుతం పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రానిక్ బైకులు వినియోగించడానికి మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో ఎలక్ట్రానిక్ బైకులకు అధిక డిమాండ్ పెరుగుతోంది. ఈక్రమంలోనే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేశారు. అయితే ఇది మార్కెట్లో లభించే ఎలక్ట్రానిక్ బైక్ కన్నా ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన ఈ ఎలక్ట్రిక్ బైకు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది వైర్ లెస్ చార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. చూడటానికి సైకిల్ ఆకారంలో ఉన్నటువంటి దీనిని సైకి బైక్ అని పిలుస్తారు. ఈ బండి గంటకి సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అదేవిధంగా ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రతిరోజు సుమారు 5 గంటల పాటు ఈ బండికి చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ బండి కోసం సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది. అది సరిగ్గా ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ చాలా తక్కువగా ప్రపంచ దేశాలలో ఉంది. అయితే ఈ బైక్ తయారు చేయడానికి ముందుగానే విద్యార్థులు డూప్లికేట్ ప్రోటోటైప్ తయారుచేశారు. ల్యాబులోని పరికరాలతో చేశారు. అదేవిధంగా ఈ బండిలో BLDC మోటర్ అమర్చారు. ఫలితంగా కంట్రోలర్ ద్వారా మాడ్యూల్స్‌ని మార్చవచ్చు. ఈ విధంగా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ పై యూనివర్సిటీ ప్రెసిడంట్ కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్టును స్టార్టప్‌గా ప్రారంభించేందుకు యూనివర్శిటీ రూ.1,40 లక్షలు ఆ టీమ్‌కి అందజేశారు.