Vyooham Web Series OTT Release Date : ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తుంది. అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో తెగ సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు హిందీలో మాత్రమే రూపొందే వెబ్ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం తెరకెక్కుతూ ప్రేక్షకులకి వినోదం పంచుతున్నాయి. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్ గా వచ్చిన కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్, రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్ సిరీస్‌లు తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కోవలోనే వ్యూహం వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన వ్యూహం ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందగా, ఈ వెబ్ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్ డిసెంబర్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు వ్యూహం వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు.

వ్యూహం ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ కాగా, ఇందులో న్యాయం కోసం అతడు చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు, అతని వేటాడే గతం వ్యూహం సిరీస్ ను ఇంట్రెస్టింగా మార్చనుంది. మరి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని ఇష్టపడే వాళ్లు ఈ వ్యూహం సిరీస్ చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో ఓ సినిమా చేయగా, ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్‌కి నోచుకోలేదు. చూస్తుంటే దానిని ఆయన సైలెంట్‌గా ఓటీటీలోకి విడుదల చేసే అవకాశం ఉంది.