Nandamuri Ramakrishna : ఇటీవల నందమూరి ఫ్యామిలీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులని ఆందోళనకి గురి చేస్తున్నాయి. హరికృష్ణ, జానకిరామ్‌ల మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నందమూరి ఫ్యామిలీకి ఇటీవల తారకరత్న ఆసుపత్రి పాలవ్వడం కోలుకోలేని షాకిచ్చింది. నారా లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభిస్తున్న రోజు కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. అయితే అదే రోజు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుప్పం పాదయాత్రలోనే కుప్పకూలిపోయారు.
వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లినా, దానికి సుమారు 45 నిమిషాలు పట్టింది. ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది అని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో రక్త ప్రసరణ ఆగిపోవడంతో ఆయన ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని చెబుతున్నారు. గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించిందని అప్పటినుంచి ఆయనను మామూలు మనిషిని చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన నారాయణ హృదయాలయ అనే హాస్పిటల్లో గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని పైభాగం కొంతమేర దెబ్బతిందని దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.

తారకరత్న ఆరోగ్యం గురించి అందరు ఆందోళన చెందుతున్న సమయంలో బాలకృష్ణకు సోదరుడు అయిన నందమూరి రామకృష్ణ కారుకు హైదరాబాద్ లో యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం ఉదయం కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ప్రయాణిస్తుండగా, ఆయన కారు అదుపుతప్పి రోడ్ డివైడర్ ని ఢీ కొంది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారుని పక్కనే నిలిపి అక్కడి నుంచి రామకృష్ణ వెళ్లిపోయారు. కారులో ఆయన ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. కాగా, తారకరత్నని ఇటీవలే పరామర్శించి వచ్చారు రామకృష్ణ.ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోయే సరికి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.