Nagarjuna : అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా ఆగస్టు 8వ తేదీన ఉదయం 9.42 గంటలకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇక ఇదే విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా నాగార్జున తన కుమారుడు నాగ చైతన్యపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆంగ్ల మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..
సమంతతో విడాకులు తీసుకున్న తరువాత చైతూ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఒక తండ్రిగా నా కుమారుడిని నేను అలాంటి స్థితిలో చూడలేను. కానీ చైతూకు ఇప్పుడు చక్కని తోడు లభించింది. శోభిత నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆమె అడివి శేష్‌తో కలిసి గూఢచారి సినిమాలో నటించినప్పటి నుంచి నాకు ఆమెతో పరిచయం ఉంది. మేము కలసినప్పుడు సినిమాలు, ఫిలాసఫీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం.. అని నాగార్జున అన్నారు.

శోభిత చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. ఆమె తల్లిదండ్రులకు చైతూ అంటే ఎంతో ఇష్టం. వారు దాదాపుగా 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ ఏర్పడింది. పెళ్లి చేసుకుంటాం అని చెప్పారు. మేము ఓకే చెప్పేశాం. చైతూ హ్యాపీగా ఉండడమే నాకు కావల్సింది. సమంతతో విడాకుల తరువాత చైతూ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు కావల్సింది కూడా అదే.. అని నాగార్జున అన్నారు.
శోభిత, చైతూ ఇద్దరు ఒక చక్కని కపుల్ అవుతారు. నా కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా ఎదిగారు. చైతూ సున్నిత మనస్కుడు. తన జీవితంలోకి ఇప్పుడు మళ్లీ హ్యాపీ క్షణాలు వచ్చాయి.. అని నాగార్జున చెప్పారు. కాగా నాగచైతన్య, సమంత ఇద్దరూ సుమారుగా 5 ఏళ్ల పాటు ప్రేమించుకుని 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ అనుకోని మనస్ఫర్థల కారణంగా వారు 2021 అక్టోబర్‌లో విడిపోయారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో వేర్వేరుగా ప్రకటించారు. అయితే శోభితతో చైతూ నిశ్చితార్థం అనంతరం సమంతను చైతూ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.