Deepak Saroj : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇందులో త్రిష హీరోయిన్ కాగా మణిశర్మ సంగీతం అందించారు. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గా నటించిన కుర్రాడు.. నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా..? అని అడిగితే.. ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో.. అని బ్రహ్మానందం అనే డైలాగ్ పటాస్ లా పేలింది.
అలాగే మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్ర మూవీలో అన్నయ్య సాంబార్లో చికెన్ వేసుకో బాగుంటుంది అని.. ఓ చిన్నోడికి చిన్నది చెప్తుంది. అతడు మూవీలో చేసిన ఆ కుర్రాడే ఆ చిన్నోడు. అంతవరకూ బాగానే ఉంది అసలు విషయం ఏమిటంటే.. ఈ కుర్రాడి పేరు దీపక్ సరోజ్. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. టీనేజ్ లోకి వచ్చిన ఇతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
దీపక్ చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపుగా 20 సినిమాలకు పైగానే నటించి మిణుగురులు సినిమాలో నటించాడు. 2014లో వచ్చిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకున్నాడు. ఆ మధ్య బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో దీపక్ పేరు విన్పించినా ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మోడలింగ్ వైపు అడుగులు వేస్తున్నాడు దీపక్. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫిజిక్‌తో బాగానే రెడీ అయ్యాడు దీపక్. మరి చూడాలిక.. ఏ మూవీతో ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తాడో..!