ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్నఫ్యామిలీకి సంబంధించిన విషయాలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన భార్య ఎవరు, ఏం చేస్తారు, తండ్రి ఎవరు అనే విషయాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుతున్నారు. అయితే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కి 12 మంది సంతానం కాగా, అందులో 8 మంది మగపిల్లలు ఉన్నారు. ఇందులో 5వ కుమారుడే నందమూరి మోహన్ కృష్ణ. ఎప్పుడూ కూడా పెద్దగా వార్తలలో కనిపించని నేపథ్యంలో ఆయన గురించి జనాలకు పెద్దగా తెలియదు.
నందమూరి మోహన్ కృష్ణ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ సినిమాలకు చాయాగ్రహకుడిగా కూడా పనిచేశారట. ఈయన 2 సెప్టెంబర్ 1956లో అన్న హరికృష్ణ పుట్టినరోజునే ఈయన జన్మించడం విశేషం. మోహన్ కృష్ణ బాల్యం .. నిమ్మకూరు, చెన్నైలో జరిగింది. పెళ్లి సమయానికి వీరంత హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తిగా ఉండడంతో నటనపై కాకుండా సినిమాటోగ్రఫీపై మోహనకృష్ణ మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి బాబాయి త్రివిక్రమ్ రావుతో కలిసి ప్రొడక్షన్ వ్యవహరాలు చూసుకునేవాడు.
ఇక డిగ్రీ చేస్తూనే ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నా మోహన్ రావు ముందుగా దానవీరశూరకర్ణకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా కన్నప్ప వద్ద పని చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టారు. అనంతరం ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చండశాసనుడు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్, బాలయ్య ముఖ్యపాత్రల్లో నటించిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’కు ఈయన అందించిన సినిమాటోగ్రఫీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆయన పలు సినిమాలు చేశారు. ఈయన 1980లో ప్రముఖ నిర్మాత యు.విశ్వేశ్వరరావు కూతురు శాంతిని వివాహాం చేసుకున్నారు. వీరికి నందమూరి తారకరత్న.. నందమూరి రూప అనే పిల్లలు ఉన్నారు. చివరిగా వెంకటాద్రి సినిమాకి ఈయన నిర్మాతగా వ్యవహరించారు.