Bhimla Nayak : పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు కీలకపాత్రల్లో నటిస్తున్న మూవీ.. భీమ్లా నాయక్. ఈ మూవీ విడుదల తేదీపై ఎప్పటికప్పుడు వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీ పోస్ట్ పోన్ అయిందని, సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత నాగ వంశీ స్వయంగా స్పందించారు. మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2022వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు.
అయితే తాజాగా మళ్లీ ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న RRR మూవీ కోసం దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే భీమ్లా నాయక్ టీమ్‌తో చర్చించారట. అలాగే పవన్‌తోనూ సంప్రదింపులు జరిపారట. దీంతో పవన్ తన మూవీని వాయిదా వేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారట. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.
కాగా భీమ్లా నాయక్ విడుదల తేదీని వాయిదా వేసినట్లు అధికారికంగా వార్తలు రాలేదు. కానీ ఫిబ్రవరి 24, 2022వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు డీవీవీ దానయ్య, నాగ వంశీలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావల్సి ఉంది.