ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పేద విద్యార్థులు, యువత కోసం అద్బుతమైన కోర్సును ఉచితంగా అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కింద క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణను అందిస్తోంది. ఈ శిక్షణ అంతా ఉచితం. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు చెందిన పలు అంశాల్లో శిక్షణను ఇస్తారు.
ఈ కోర్సులో రెజ్యూమ్ రాయడం, ఇంటర్వ్యూలకు హాజరు అయ్యేటప్పుడు పాటించాల్సిన మెళకువలు, డేటాబేస్ స్కిల్స్, లైనక్స్, పైథాన్, సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో చేరే వారికి ఎలాంటి టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన పనిలేదు. ఎవరైనా, ఏ వయస్సు వారైనా ఇందులో చేరి ఉచితంగా శిక్షణ తీసుకోవచ్చు.
శిక్షణ కాలవ్యవధి 12 వారాలు. శిక్షణ పూర్తి అయ్యాక పలు సంస్థలతో మాట్లాడి అమెజాన్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 52 నగరాల్లో రానున్న రోజుల్లో 29 మిలియన్ల మందికి క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణను అందించడమే లక్ష్యంగా అమెజాన్ ముందుకు సాగుతోంది.
ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి కంపెనీల్లో ఎంట్రీ లెవల్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇది పేద విద్యార్థులు, యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.