ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రితో ఆయుర్వేద ప్ర‌కారం ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

వినాయ‌కుడి పూజ‌లో మొత్తం 21 ర‌కాల ప‌త్రిని ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఒక్కో ప‌త్రిలో భిన్న‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. వాటితో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయ‌కుడి పూజ‌లో మాచి పత్రము, బృహతి పత్రము, బిల్వపత్రము, దూర్వ పత్రము, దత్తూర పత్రము, బదరి పత్రము, ఆపామార్గ పత్రము, తులసి పత్రము, చూత పత్రము, కరవీర పత్రము, విష్ణుక్రాంత ప‌త్రము, దాడిమ పత్రము, దేవదారు పత్రము, మరుతక పత్రము, సింధువార పత్రము, జాజి పత్రము, గలడలి పత్రము, శమి పత్రము, అశ్వ‌త్థ పత్రము, అర్జున పత్రము, అర్క పత్రము.. అని 21 ర‌కాల ప‌త్రిల‌ను ఉప‌యోగిస్తారు.

1. మాచి పత్రము: మాచిపత్రం ఆకులను నీళ్లలో తడిపి కంటికి చుట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. చర్మ రోగాలకు, నులి పురుగులకు, కుష్టు, బొల్లి, దప్పికల‌కు ప‌నిచేస్తుంది.

2. బృహతి పత్రము: ఈ ఆకుల‌ను నీళ్ళలో బాగా కాచి ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్లనొప్పులు ఉన్న చోట కట్టుకడితే నొప్పులు తగ్గుతాయి. బృహతీ పత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం కషాయంతో నోటిని శుభ్రపరచకుంటే నోటిదుర్వాసన తొలగిపోతుంది. ర‌క్తశుద్ధి చేయగల శక్తి బృహతీ పత్రానికి ఉంది. బృహతీ పత్రం కంటి రోగాలకు, శరీరంలో నొప్పులను నయం చేసేందుకు, ఎక్కిళ్ళను త‌గ్గించేందుకు, కఫ, వాత దోషాలను, ఆస్తమా, దగ్గు స‌మ‌స్య‌ల‌కు, జీర్ణశక్తిని పెంచేందుకు, గుండె ఆరోగ్యానికి ప‌ని చేస్తుంది.

3. బిల్వ పత్రము: ఇది మనందరికీ బాగా పరిచయం అయింది. దీనిని మారేడు అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మధుమేహం ఉన్నవారు రోజూ రెండు ఆకులను న‌మిలితే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. తాజా మారేడు ఆకుల రసాన్ని కళ్ల‌ల్లో వేసుకుంటే కళ్ల కల నుంచి ఉపశమనం కలుగుతుంది. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. విరేచనకారిగా కూడా పనిచేస్తుంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. విరేచనాలు తగ్గడానికి గుజ్జును ఎండబెట్టి పొడిగా చేసి తీసుకోవాలి.

4. దూర్వ పత్రము: దీన్నే గ‌రిక అంటారు. వినాయకుడికి అత్యంత ప్రీతిక‌ర‌మైంది. గ‌రిక దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. గరికను పచ్చడిగా చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయం అవుతాయి. చర్మం, రక్త వ్యాధులు త‌గ్గుతాయి.

5. దత్తూర పత్రము: దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకు. ఇది ఉష్ణ తత్వం కలిగి ఉంటుంది. ఆస్తమా, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

6. బదరి పత్రము: బదరీపత్రం అంటే రేగు ఆకు. ఇది చిన్న పిల్లల వ్యాధులు బాగా నయం చేస్తుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల‌లో వచ్చే అన్ని సాధారణ వ్యాధుల‌ను తగ్గిస్తుంది. చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపుల‌ వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి. రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది. ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగి పండ్లతో చేసిన‌ టానిక్‌ను ఎంచుకుంటారు. వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయ‌ని జపనీయుల పరిశోధనల‌లో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతాయి. బాధా నివారిణిగా, క్యాన్సర్‌ వ్యతిరేకిగా, ఉపశమన కారిగా ప‌నిచేస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయొ. ఆకలి లేమి, ర‌క్తహీనత, నీరసం, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టరీయా వంటి వాటి నివారణా మందులలో వీటిని వాడతారు. విత్తనాలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో వేర్లను ఉపయోగిస్తారు. వెంట్రుకలు పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది.

7. ఆపామార్గ పత్రము: గణనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పత్రంల‌లో ఇది ఒకటి. దీనినే ఉత్తరేణి అని కూడా పిలుస్తారు. ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేర్ల‌తో దంతాల‌ను తోమితే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు రాస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది. అలాగే దురదలు, పొక్కులు, శరీరంపై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి. ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే దంతాల‌ నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి. ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కలిపి గజ్జి, తామర తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి. ఈ బూడిదని తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి. మజ్జిగలో కలిపి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణి చూర్ణానికి ఆవునెయ్యి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కలిపి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి. నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధనా చేసుకుంటే కొవ్వు కరిగి సాధారణ స్ధితికి వస్తారు.

8. తులసి పత్రము: తులసి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులను, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండు మూడు గంటలకోసారి తాగొచ్చు. పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది. ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి. ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉంచుతారు. కీటకాలను దూరంగా ఉంచడం కోసం అలా చేస్తారు.

9. చూత పత్రము: చూతపత్రం అంటే మామిడి ఆకులు. వీటిలో కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి. మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. రెండు కప్పుల‌ నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంత సేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమను కుంటే ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేయవచ్చు. గొంతు నొప్పి త‌గ్గుతుంది. మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. క‌డుపులో పురుగులు న‌శిస్తాయి. మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది. ఒక జాడీలో కొబ్బరి నూనెను గానీ, నువ్వుల నూనెను గానీ తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి. స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కు నుంచి అయ్యే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి. కంటి నొప్పి త‌గ్గుతుంది. మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. దంత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి. మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్‌ను చిలకరించి ఆస్వాదించండి. నీర‌సం త‌గ్గుతుంది. లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి ఉంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగప‌డుతుంది.

10. కరవీర పత్రము: కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు. గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీలిస్తే చాలు అనేక రోగాలు తగ్గుతాయి.

11. విష్ణుక్రాంత పత్రం: మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేథ‌స్సును పెంచుతుంది. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

12. దాడిమీ పత్రం: దాడిమీ పత్రం అంటే దానిమ్మ. దానిమ్మ ఆకుల రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా ప‌నిచేస్తుంది. వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరేచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పండ్లు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్నీ ఔషధ గుణాల‌ను కలిగి ఉంటాయి. దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి తీసుకుంటే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే వాపులు తగ్గుతాయి.

13. దేవదారు: ఇది అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది. ఇది చర్మ వ్యాదులు, చిన్న చిన్న దెబ్బలు మానడానకి ఉపయోగపడుతుంది.

14. మరువక పత్రం: మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

15. సింధువార పత్రం: వావిలి ఆకు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాలు. రెండింటిలో ఏవైనా ఆకులను నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి. ఈ ఆకులతో పచ్చడి చేసుకుంటారు. వేడినీళ్ళలో వావిలి ఆకులు వేసి దానిలో గుడ్డ తడిపి కాపడం పెట్టుకుంటారు. కీళ్ళ సంబంధిత విషాలకు విరుగుడుగా వాడుతుంటారు. ఈ ఆకుల వాసన చీకటి ఈగల‌ను రాకుండా నిరోధిస్తుంది.

16. జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకుల‌ను వెన్నతో నూరి ఆ మిశ్రమంతో దంతాల‌ను తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజూ తీసుకోవడం వల్ల‌ క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్ల కలకను, కడుపులో నులి పురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాల‌ను నయం చేస్తారు.

17. గండకీ పత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధంగా గండకీ పత్రం ప‌నిచేస్తుంది. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును త‌గ్గిస్తుంది. ఆస్త‌మాను తగిస్తుంది.

18. శమీ పత్రం: దీని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దీని మీదనే తమ ఆయుధాలను దాచి పెట్టారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుండ్లు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చ‌క్కెరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

19. అశ్వత్థ పత్రం: రావి వృక్షం అని దీన్ని పిలుస్తారు. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమాట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావి మండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది. రక్త శుద్ధిని చేస్తుంది.

20. అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు, ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాల్‌, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. పుండు నుంచి రక్తం కార‌డాన్ని త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి ఎముకలు విరిగినచోట క‌డితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.. దీని బెరడును నూరి వ్రణమున్న ప్రదేశంలో కడితే ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.

21. అర్క పత్రం: దీన్నే జిల్లేడు ఆకు అంటారు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాల‌ను కలిగి ఉంటాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడు పూలను వాడుతారు. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM