Mahashivratri 2023 : హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది ఏడాదికి ఒకసారి వస్తుంది. నెలకోసారి వచ్చే శివరాత్రి సాధారణమైనది కాగా.. ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. ఈ రోజు శివ పార్వతుల కల్యాణం జరుగుతుంది. అలాగే శివలింగం ఉద్భవించిన సమయం కూడా ఇదే. కనుకనే ఈ రోజును భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఉదయం నిద్ర లేచి స్నానపానాదులు ముగించుకుని శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం మళ్లీ శివ దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విడుస్తారు. ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేస్తారు. తెల్లారాక మళ్లీ స్నానం చేసి శివ దర్శనం చేసుకుంటారు. దీంతో మహా శివరాత్రి ముగుస్తుంది.
మహా శివరాత్రి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్ని శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతాయి. భక్తుల కోలహలంతో ఆలయాల్లో సందడి నెలకొంటుంది. పలు ఆలయాల వద్ద శివరాత్రి జాతర, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజున శివుడు తాండవం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కనుక లింగోద్భవ సమయంలో శివ పూజ చేస్తే మంచిదని చెబుతారు. అలాగే రుద్రాభిషేకాలు కూడా చేస్తారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి వచ్చింది. ఈ క్రమంలోనే భక్తులు ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఆలయాలన్నీ ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి.

ఇక మహా శివరాత్రి ఈసారి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉండనుంది. ఈ సమయంలో చేసే పూజలకు, అభిషేకాలకు మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఏడాది మొత్తం శివ పూజ చేస్తే వచ్చే పుణ్యం ఈ ఒక్క రోజే వస్తుందని.. అందుకు గాను శివుడికి రుద్రాభిషేకం చేయడంతోపాటు ఉపవాస దీక్ష, జాగరణ దీక్ష చేయాలని.. చెబుతున్నారు. ఇక శివుడికి పాలు, తేనెతో అభిషేకం చేయాలని.. ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజలు చేయాలని.. దీంతో అనుకున్నవి నెరవేరుతాయని చెబుతున్నారు.