Holi 2023 : హిందువులు జరుపుకునే అనేక పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే కులమతాలకు అతీతంగా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించి విజయానికి గుర్తుగా హోలీని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తరాది వారు హోలీ వేడుకల్లో ఎక్కువగా మునిగి తేలుతుంటారు. హోలీని ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ముందు రోజు హోలికా దహనం ఉంటుంది. తరువాత రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇలా హోలీ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
ఇక హోలీ పండుగ రోజు శుభ ముహుర్తం ఏ సమయంలో ఉంది.. అప్పుడు ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ పండుగ రోజు పూజ చేసేందుకు మార్చి 6 సాయంత్రం 4:17 గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6:19 గంటల వరకు శుభ ముహుర్తం ఉంది. ఇక మార్చి 7 సాయంత్రం 6:29 నుంచి రాత్రి 8:49 వరకు హోలికా దహనం నిర్వహించుకోవచ్చు. అయితే శుభ ముహుర్తం ఉన్న సమయంలోనే పూజ చేయాల్సి ఉంటుంది. అందుకు కావల్సిన వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి.

హోలీ పూజ చేసేందుకు గాను నీళ్లు, పువ్వులు, శనగ పిండి లడ్డూలు, శనగలు, బెల్లం, పూలమాల, ఆవు పేడ, బియ్యం వంటి వస్తువులను ఉపయోగించాలి. ఈ పూజను హోలికా దహన పూజ అంటారు. ఇందులో భాగంగా శుభ ముహుర్తం ఉన్న సమయంలో ఇంట్లో ఉత్తరం దిక్కున నెయ్యితో దీపం వెలిగించి పెట్టాలి. దీంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రోజు పూర్తిగా సాత్వికాహారం తినాలి. మాంసాహారం ముట్టరాదు. మద్యం సేవించరాదు. ఎవరికీ ఏ వస్తువులు ఇవ్వరాదు. డబ్బును అప్పుగా కూడా ఇవ్వకూడదు. అలాగే మహిళలు జుట్టు విరబోసుకుని ఉండరాదు. ఇలా పూజలో జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనుకున్నది నెరవేరుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. మీకు తిరుగే ఉండదు.