Garikapati : ప్రస్తుత తరుణంలో సమాజంలో రోజు రోజుకీ మహిళలపై అఘాయిత్యాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. పసికందు మొదలుకొని వృద్ధ మహిళల వరకు అందరూ మృగాళ్ల వేధింపులకు బలవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను అమలు చేస్తున్నామని చెబుతున్నా ఈ అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే విషయంలో చాలా మంది అనేక రకాలుగా తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ఎప్పటికప్పుడు చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రముఖ అవధాని, పండితుడు గరికపాటి నరసింహారావు మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పురాణాలు, ఇతిహాసాలకు చెందిన విషయాలను మనకు అర్థమయ్యేలా చెబుతారు. ఆయన ప్రవచనాలు చెబుతున్నప్పుడు అనేక నీతి విషయాలను హాస్యంతో బోధిస్తారు. అందుకనే ఆయనకు అభిమానులు కూడా ఎక్కువే. ఆయన ప్రవచనాలను రోజూ చాలా మంది వింటుంటారు. ఈ క్రమంలో గతంలో ఓ సందర్భంలో ఆయన ఓసారి అవధానం చేసిన సమయంలో మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

రామాయణం, భారతాల్లో సీత, ద్రౌపదిల వల్లే యుద్ధాలు జరిగాయని అన్నారని కానీ అది సరికాదని.. పురుషులకు ఉండే పరస్త్రీ వ్యామోహం వల్లే వారికి ఆ గతి పట్టిందని గరికపాటి అన్నారు. అంతేకానీ ఇందులో ద్రౌపది, సీతల తప్పు ఏమీ లేదని, వారిని నిందించరాదని అన్నారు. అలాగే ప్రస్తుత తరుణంలో మహిళల వస్త్రధారణ సరిగ్గా ఉండడం లేదన్నారు. అవయవాలు అన్నీ కనిపించేలా దుస్తులు ధరిస్తున్నారని.. అలా చేస్తే 17 ఏళ్ల పిల్లలకే కాదు.. తనలాంటి వృద్ధులకు కూడా వ్యామోహం కలుగుతుందని అన్నారు. కనుక మహిళల వస్త్రధారణ మారాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ వీడియో పాతదే అయినా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.