ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మన పెద్దలు కూడా దైవ దర్శనం చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుందని.. అలాగే దైవం ఆశీస్సులు లభించి అనుకున్నవి నెరవేరుతాయని.. ఎలాంటి సమస్యలు కలగవని అంటుంటారు. అందుకనే చాలా మంది తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అయితే ఆలయాలకు వెళ్లే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆలయానికి వెళ్లడం కూడా ఒకటి. ఈ ఆహారం తీసుకున్న తరువాత అసలు ఆలయానికి వెళ్లవచ్చా.. ప్రసాదం తినవచ్చా.. వంటి సందేహాలకు పండితులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం తిన్న తరువాత ఆలయానికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లరాదు. అలాగే ప్రసాదం లాంటివి కూడా తినరాదు. ఎందుకంటే.. అసలు మాంసాహారం అని కాదు.. శాకాహారం తీసుకుని కూడా ఆలయానికి వెళ్లరాదు. ఉపవాస దీక్షతో ఉండి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రావాలి. ఆ తరువాత ఏ ఆహారం అయినా తినవచ్చు. అంతేకానీ.. ఆహారం తిన్నాక మాత్రం ఆలయానికి వెళ్లరాదు. ఎందుకంటే ఆహారం తిన్న తరువాత నిద్ర వస్తుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అదే మాంసాహారం అయితే ఇంకా ఎక్కువగా నిద్రగా, మత్తుగా అనిపిస్తుంది. ఇలా నిద్ర మత్తులో ఉండి దైవాన్ని దర్శించుకోలేరు. దర్శించుకున్నా మనస్సు దైవంపై ఉండదు.
పైగా ఆహారం తిన్న తరువాత దాని లక్షణాలు మనకు వస్తాయి. అంటే మాంసాహారం తిన్నాక తామస గుణాలు వస్తాయి. కోపం, అసూయ, ద్వేషం అన్నీ కలుగుతాయి. అలాంటి స్థితిలో దైవంపై మనస్సు పెట్టలేరు. ఏమీ కోరుకోలేరు. ఒకవేళ కోరినా మనస్ఫూర్తిగా చేయరు. అలాంటప్పుడు దైవం వద్దకు వెళ్లి కూడా ఉపయోగం ఉండదు. కనుక మాంసాహారం అనే కాదు.. అసలు శాకాహారం కూడా తినకుండానే.. ఉపవాసంతోనే దైవాన్ని దర్శించుకోవాలి. దీంతో దైవంపైనే ధ్యాస అంతా ఉంటుంది. మనం అనుకున్నవి ప్రశాంతంగా దైవాన్ని కోరవచ్చు. దీంతో దైవ దర్శనం చేసుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఇకపై ఆలయానికి వెళ్లాలంటే ఏమీ తినకుండానే వెళ్లండి. దీంతో మనస్ఫూర్తిగా కోరికలు కోరవచ్చు. దైవ దర్శనం కూడా సంపూర్తిగా అవుతుంది. కాబట్టి ఇకపై అలా చేయండి.