Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటారు. అటు.. సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖలకు సంబంధించిన జాతకాలను చెప్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అయితే.. వాటి గురించి ఎవరూ అడగకపోయినా.. తనకు తానుగా చెప్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు మన వేణు స్వామి.గతంలో.. సమంత- నాగచైతన్య వివాహ జీవితంపై సంచలన ఆరోపణలు చేసి.. ఒక్కసారిగా ఫేమస్ అయిన వేణుస్వామి..ఇటీవలనాగచైతన్య- శోభితా దూలిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి కీలక ఆరోపణలు చేసి.. అంతకు మించి వివాదాల్లో ఇరుక్కున్నారు.
సమంత, నాగ చైతన్య విడిపోయినట్టుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా కొద్ది రోజులకే విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్‌ను సినీ ఇండస్ట్రీలోని పలువురు సీరియస్‌గా తీసుకుని.. ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల పర్సనల్ జీవితంపై ఇలా నిరాధారంగా ఆరోపణలు చేస్తుండటం, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించమేనని అభిప్రాయపడ్డారు. ఇక.. వేణుస్వామి తీరుపై సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్.. ఏకంగా మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు కూడా చేయటం గమనార్హం.ఈ క్రమంలోనే.. జర్నలిస్టు మూర్తిపై వేణుస్వామి, ఆయన సతీమణి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. తమను జర్నలిస్టు మూర్తి.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. ఇవ్వకపోయేసరికి తనను టార్గెట్ చేశాడంటూ ఘాటు ఆరోపణలు చేశారు. తమకు మూర్తి నుంచి ప్రాణ హాని ఉందని.. కూడా ఆరోపించారు. దీంతో.. ఆ ఆరోపణలపై స్పందించిన మూర్తి.. పోలీసులుక ఫిర్యాదు చేయటంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.
జాతకాల పేరుతో ప్రజలను వేణు స్వామి మోసం చేస్తున్నారని… ప్రధాని మోదీ ఫొటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టులో ప్రముఖ పాత్రికేయుడు ‘టీవీ5’ మూర్తి పిటిషన్ వేశారు. వేణు స్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ లో మూర్తి పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణు స్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.