తన బాబుకు జలుబు చేసిందని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆ తల్లి మనసు విలవిలలాడి పోయింది. ఆలస్యం చేస్తే తన బిడ్డకు ఏం జరుగుతుందోనని కంగారు పడింది. తన బిడ్డకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతో అర్ధరాత్రి మందుల చీటీ పట్టుకుని హడావుడిగా మందుల కోసం బయలుదేరిన తల్లి తిరిగి రాలేదు.. ఇక అమ్మ ఎప్పుడూ ఇంటికి రానంత దూరం వెళ్లిపోయింది. ఎవరి కోసమైతే అమ్మ ఆరాటపడిందో ఆ చిన్నారిని ఒంటరి చేసి ఆ తల్లి వెళ్ళిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురంజిల్లా శ్రీనివాస్ నగర్ కు చెందిన జగదీష్ అనే వ్యక్తిని యాస్మిన్ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2సంవత్సరాల బాబు ఉన్నాడు. తాజాగా బాబు తీవ్రమైన జలుబుతో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే తన కొడుకుని ఆ పరిస్థితులలో చూసేటప్పటికీ ఆ తల్లి మనసు విలవిలలాడింది.తన భర్తను లేపి మందులు తీసుకురావాలని చెప్పడంతో జగదీష్ ఏమీ కాదు ఈ సమయంలో వద్దు పొద్దున్నే హాస్పిటల్ కి తీసుకెళ్తామని చెప్పాడు. అయినప్పటికీ ఆ తల్లి మనసు ఆగలేదు.
తన బిడ్డకు ఏమి కాకూడదనే ఉద్దేశంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మందుల చీటీ చేతపట్టుకొని స్కూటీపై మందులను కొనుగోలు చేయడానికి వెళ్ళింది.ఈ క్రమంలోనే చంద్ర హాస్పిటల్ సర్కిల్ కి వెళ్ళగానే వెనుక నుంచి వేగంగా వస్తున్నటువంటి ఒక కారు ఆమె స్కూటీని గుద్దడంతో యాస్మిన్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని డ్యూటీలో ఉన్న ఎస్ఐ గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే యాస్మిన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వద్దని వారిస్తున్నప్పటికీ తన బిడ్డ కోసం బయటకు వెళ్లిన యాస్మిన్ ఎప్పటికీ తన బిడ్డ దగ్గరకు రానంత దూరం వెళ్ళిపోయిందని యాస్మిన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.