సాధారణంగా మనం ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే తిరిగి వారికి చెల్లించాల్సిందే. సరైన సమయంలో చెల్లించకపోతే అప్పు ఇచ్చిన వారు మాటిమాటికి మనల్ని అప్పు తిరిగి చెల్లించమని అడుగుతుంటారు. ఈ విధంగా అప్పు చెల్లించమని ఓ మహిళ అడగడంతో ఆ యువకుడు ఏకంగా ఆమె ఫోన్ నెంబర్ కాల్ గర్ల్ అంటూ షేర్ చాట్ లో పోస్ట్ చేసిన ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన సమీప బంధువు దగ్గర రెండు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తన అప్పు తనకు చెల్లించమని సదరు మహిళ మాటకి ఫోన్ చేసినప్పటికీ యశ్వంత్ ఇవ్వకపోవడంతో ఆ మహిళ యశ్వంత్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో యశ్వంత్ తల్లిదండ్రులు తనని మందలించారు.
తాను అప్పు తీసుకున్న సంగతి తల్లిదండ్రులకు చెప్పారన్న విషయం మనసులో పెట్టుకుని యశ్వంత్ సదరు మహిళపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన సెల్ ఫోన్ నెంబర్ కాల్ గర్ల్ అంటూ షేర్ చాట్ లో పెట్టాడు. దీంతో ఆమెకు వివిధ నెంబర్లతో ఫోన్లు రావడంతో పాటు వారు ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటపడింది.దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.