తన కూతురికి 4 నెలల క్రితం కట్న కానుకలు ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి అత్తవారింటికి సాగనంపారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే భార్య భర్తల మధ్య కలహాలు మొదలవడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించే తన కూతురు, అల్లుడికి సర్ది చెబుదామని వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటికి చేరుకోగా వారు రావడంతో ఆందోళన చెందిన వరుడు గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేవుని పల్లి గ్రామానికి చెందిన రఘు వర్ధన్ అనే యువకుడికి భిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామానికి చెందిన రవళితో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. వీరి వివాహ సమయంలో కట్నకానుకలను ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ కూతురు, అల్లుడికి సర్ది చెబుదామని అత్తమామలు వరుడి ఇంటికి వచ్చారు. అయితే వారిని చూసిన వరుడు ఎంతో కంగారు పడుతూ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రఘు వర్ధన్ ని చూసిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పెళ్లయిన 4 నెలలకే తన భర్తను అలా చూడటంతో రవళి కన్నీరుమున్నీరైంది. ఈ క్రమంలోనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.