కేవలం ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దని తన తల్లి కూతురిని హెచ్చరించేందుకుగాను ఆ కూతురు తల్లికి కడుపుకోతను మిగిల్చింది. కేవలం తన తల్లిదండ్రులు తనని మందలించారన్న కోపంతోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ సమీపంలో చోటు చేసుకుంది. ఘట్ కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్‌నగర్ జిల్లా ఉంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల ఒక కుమార్తె కుమారుడు కలరు. వీరు అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు స్రవంతి పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కాలేజీలు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉన్న స్రవంతి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ గడిపేది.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనని ఫోన్లో మాట్లాడడం తగ్గించమని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోక పోవడంతో శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులు గట్టిగా మందలించారు.
ఈ విధంగా తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి శుక్రవారం రాత్రి పడుకున్న సమయంలో కిరోసిన్ డబ్బా చేతపట్టుకొని తల్లిదండ్రులు బయటకు రాకుండా తలుపు బయట గడియ పెట్టి సమీప కాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మరుసటి రోజు ఉదయం వాకింగ్ వెళ్లిన స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటన స్థలం వద్ద సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.