Joy E-Bike : ప్రస్తుత తరుణంలో పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరిట ఓ సీఎన్‌జీ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. అయితే మీకు తెలుసా.. నీళ్లతో పనిచేసే స్కూటర్లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయని..? అవును, మీరు విన్నది నిజమే. ఈ వాహనాలు నీళ్లతోనే పనిచేస్తాయి. ఇక ఈ వాహనాలను జాయ్ అనే కంపెనీ లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్ విజర్డ్.. హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ కంపెనీ నీటితో పనిచేసే స్కూటర్‌ను ఆవిష్కరించింది. దేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం హైడ్రోజన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీ కాలుష్యాన్ని నివారిస్తుంది కూడా. అయితే జాయ్ ఈ-బైక్ దేశంలో ఈ సంవత్సరం మొబిలిటీ షోలో నీటితో పనిచేసే స్కూటర్‌ను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే వాస్తవానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో పనిచేస్తుంది. ఈ వాహనాల టెక్నాలజీ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి నీటి అణువులను విభజిస్తుంది. దీంతో ఇది స్కూటర్లలో ఇంధనంగా వాడబడుతుంది. ఇక నీటితో పనిచేసే స్కూటర్లు వేగంగా వెళ్లలేవు. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలవు. ఈ స్కూటర్‌ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహా స్కూటర్‌ను తయారు చేసేందుకు ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్‌తో సుమారుగా 150 కిలోమీటర్ల మేర దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ స్కూటర్‌ను ఇంకా డెవలప్ చేసే పనిలోనే ఉన్నారు. వాణిజ్య పరంగా ఇప్పట్లో దీన్ని ఇంకా మార్కెట్‌లోకి రిలీజ్ చేయలేమని చెప్పారు. కనుక నీటితో పనిచేసే ఈ స్కూటర్‌లను మనం త్వరలోనే మార్కెట్‌లో చూడవచ్చన్నమాట. అయితే ఈ స్కూటర్లతో ఎంతో డబ్బు ఆదా అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.