ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వారిని కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిపోయిన పలు టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,193 మంది అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం స్కేల్ కింద తీసుకోవాలని ప్రభుత్వం జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు నియామకాలు చేపట్టినప్పటికీ వీరిలో కొన్ని కారణాలవల్ల 144 మంది అభ్యర్థులు విధుల్లో చేరలేదు. ఈ క్రమంలోనే మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కరణం హరికృష్ణ, సింహాచలం పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు, ఏమిటనే విషయాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.